Bhopal | ఒకే ఒక్క ఫొటో.. ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ సీఎం కమల్‌నాథ్ ఇద్దరూ కలుసుకున్న ఫొటో ఇది. ఈ ఫొటోయే రాజకీయ రంగంలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మరో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఓ వైపు సీఎంవో ముందు ధర్నా చేస్తుండగానే, మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ సీఎం శివరాజ్‌తో భేటీ అయ్యారు. ఓ ప్రాజెక్టు విషయంలో నిర్వాసితుల సమస్యపై దిగ్విజయ్ సీఎంవో ముందు ధర్నా చేస్తున్న సమయంలోనే మాజీ సీఎం కమల్‌నాథ్ వెళ్లి సీఎం శివరాజ్‌తో మాట్లాడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై మాజీ సీఎం కమల్‌నాథ్‌ను వివరణ కోరగా… మా ఇద్దరి భేటీ అనుకోకుండా జరిగిందే. నేను చింద్వారా నుంచి బయల్దేరడం, అదే సమయంలో దేవాస్ నుంచి సీఎం చౌహాన్ బయల్దేరారు. అప్పుడే ఇద్దరం మాట్లాడుకున్నాం అని వివరణ ఇచ్చారు. ఈ భేటీ ముగిసిన తర్వాత మాజీ సీఎం కమల్‌నాథ్ సీఎంవో ముందు జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.