న్యూఢిల్లీ: మాజీ సీజేఐ బీఆర్ గవాయ్(BR Gavai).. కొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఇవాళ రాష్ట్రపతి భవన్లో జరిగిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారిక మెర్సిడీజ్ బెంజ్ కారులో వచ్చిన బీఆర్ గవాయ్.. కార్యక్రమం ముగిసిన తర్వాత తన స్వంత కారులో వెళ్లిపోయారు. నూతనంగా సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్ కోసం ప్రభుత్వ బెంజ్ కారును ఆయన విడిచి వెళ్లారు. నవంబర్ 23వ తేదీన సీజేఐ గవాయ్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి భవన్లో జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రాష్ట్రపతి ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఫంక్షన్ ముగిసిన తర్వాత మాజీ సీజేఐ గవాయ్.. తన పర్సనల్ కారులో ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్‌కు అధికారిక లగ్జరీ కారు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో గవాయ్ తన పర్సనల్ వెహికల్లో వెళ్లారు.
జస్టిస్ సూర్యకాంత్ 53వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. దేవుడి మీద ప్రమాణం చేసి ఆయన హిందీ భాషలో శపథం చేశారు. అక్టోబర్ 30వ తేదీన తదుపరి సీజేఐగా ఆయన్ను నియమించిన విషయం తెలిసిందే. 2027 ఫిబ్రవరి 9 వరకు అంటే 15 నెలల పాటూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు.