ముంబై, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ ఈవీఎంలను హ్యాక్ చేస్తానని సంప్రదింపులు జరుపుతూ ఓ వ్యక్తి అలజడి సృష్టించాడు. తనను సైబర్ నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్ షుజా అనే వ్యక్తి మహా వికాస్ అఘాడీకి చెందిన ఓ ఎంపీని సంప్రదించాడు. రూ.53 కోట్లు ఇస్తే 63 నియోజకవర్గాల్లో ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిపిస్తానని ఆఫర్ ఇచ్చాడు.
తాను అమెరికా రక్షణ శాఖలో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నానని, అక్కడి సాంకేతికత సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేస్తానని చెప్పాడు. సయ్యద్ షుజాతో ఎంపీ పీఏగా చెబుతూ ఇండియా టుడే చానల్ ప్రతినిధి వీడియో కాల్ మాట్లాడాడు. తనకు ఏయే అభ్యర్థులను గెలిపించాలో పేర్లు చెప్తే.. ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిపిస్తానని అతడు చెప్పాడు. ఇందుకోసం వీవీపాట్ల వివరాలు కావాలని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై సదరు ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.