న్యూఢిల్లీ: రాజ్యాంగ, చట్టబద్ధ హక్కుల గురించి తెలుసుకోవడం ప్రతి పౌరునికి చాలా ముఖ్యమని, వారి హక్కుల గురించి వారికి అవగాహన కల్పించకుంటే వాటిని అమలు చేయమని ఒత్తిడి చేయడానికి ముందుకు రారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. గుజరాత్లో జరిగిన నల్సా మూడు దశాబ్దాల వేడుకలో ఆయన శనివారం ప్రసంగించారు.
ప్రతి పౌరుడికి న్యాయం, ప్రతి పౌరుడికి ఉచిత న్యాయ సహాయం కోసం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ప్రయత్నాలు చేస్తున్నదని నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కూడా అయిన గవాయ్ పేర్కొన్నారు. పౌరులకు చట్టబద్ధంగా, రాజ్యాంగపరంగా లభించిన హక్కుల గురించి వారు తప్పనిసరిగా తెలుసుకోవాలని అన్నారు. మారుమూల ప్రాంతాలకు సేవలందించాలన్న నల్సా లక్ష్యాన్ని నెరవేరుస్తున్నామని అన్నారు.