కైరో, జూన్ 23: జీవితంలో ఒక్కసారైనా పవిత్రమైన మక్కాను సందర్శించాలని ప్రతి మహమ్మదీయుడు కోరుకుంటాడు. దానిని సందర్శించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాడు. అయితే ఈ ఏడాది పలు కారణాల వల్ల మక్కాకు వెళ్లే భక్తులు, యాత్రికుల సంఖ్య తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం తదితర కారణాల వల్ల మక్కాకు వెళ్లలేకపోతున్నామని భక్తులు ఆవేదన చెందుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక విపత్కర పరిస్థితుల వల్ల హజ్ యాత్ర ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది. మక్కా, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో విమాన చార్జీలు, రవాణా, ఆహారం, వసతి ఇలా అన్నింటి ధరలు మండిపోతున్నాయి. కొన్ని దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. దాంతో ఆ దేశాల కరెన్సీ విలువ దిగజారి నేలచూపులు చూస్తుండటంతో హజ్ యాత్రను చాలామంది వాయిదా వేసుకున్నారు. కొన్ని దేశాల్లో హజ్ యాత్రకు పంపాల్సిన యాత్రికుల కోటా కూడా భర్తీ కాలేదు.