DK Shivakumar : భారీ వర్షాలు (Heavy rain), నిర్వహణ లోపాలతో కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో గుంతలమయమైన రోడ్లపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. కర్ణాటక సర్కారుపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి స్పందించారు. గుంతల సమస్య దేశమంతటా ఉన్నదని, ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఉండే రోడ్డులో కూడా ఉందని అన్నారు.
సోమవారం డీకే విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను సోమవారం డిల్లీలో పర్యటించానని, ప్రధానమంత్రి నివాసానికి వెళ్లే రహదారిపై కూడా గుంతలు ఉన్నాయని, కేవలం బెంగళూరునే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. మీడియా కూడా ఈ సమస్య కేవలం కర్ణాటకలోనే ఉన్నట్లు చూపిస్తోందని విమర్శించారు. బీజేపీ హయాంలో అంత మంచి పాలన ఉంటే రోడ్లు ఇలా ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు.
బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై ‘బ్లాక్‌బక్’ అనే కంపెనీ సీఈవో రాజేశ్ యాబాజీ పెట్టిన పోస్టు తీవ్ర చర్చకు దారితీసింది. రహదారులన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో పరిస్థితిలో మార్పేమీ రాలేదని, ఇక్కడి నుంచి తాము వెళ్లిపోదామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీనిపై డీకే స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులు, బ్లాక్మెయిల్లను ప్రభుత్వం పట్టించుకోదని ఘాటుగా బదులిచ్చారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించిందని చెప్పారు.