న్యూఢిల్లీ, డిసెంబర్ 12: డిపాజిట్ బీమాకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆదివారం జరిగిన ‘డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) సవరణ బిల్లు గురించి ప్రస్తావించారు. ఆర్బీఐ చేతిలో ఆంక్షలకు గురైన బ్యాంకుల ఖాతాదారులు తమ డిపాజిట్ నుంచి 90 రోజుల్లోగా రూ.5 లక్షల వరకు తిరిగి పొందేందుకు వీలుకల్పించే ఈ బిల్లును ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంట్ ఆమోదించింది. డిపాజిటర్లకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ బిల్లును చట్టంగా మార్చినట్టు మోదీ వివరించారు. ఇది అమల్లోకి వచ్చాక గత కొన్ని రోజుల్లోనే లక్ష మందికిపైగా డిపాజిటర్లు దాదాపు రూ.1,300 కోట్ల సొమ్మును పొందారని చెప్పారు.
అధిక రాబడి ఆశిస్తే అధిక రిస్క్: శక్తికాంతదాస్
అధిక రాబడుల కోసం వెంపర్లాడే డిపాజిటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ హెచ్చరించారు. ఇలాంటి వారికి చాలా రిస్క్ ఉంటుందని పేర్కొన్నారు. అధిక రాబడులు లేదా వడ్డీలు అధిక రిస్క్‌తో ముడిపడి ఉంటాయన్న విషయాన్ని డిపాజిటర్లు విస్మరించకూడదని స్పష్టం చేశారు.