హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అన్యాయానికి గురైన కొందరు అభ్యర్థులకు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను తెలంగాణ పోలీసు నియామక బోర్డు పట్టించుకోవడం లేదు. ఇదేమిటని అడిగితే బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు.
దీనిపై ఆ అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి 14న అపాయింట్మెంట్ లెటర్లు అందించాలనే ఉద్దేశంతో వారికి బోర్డు అధికారులు ఆదరాబాదరాగా మెడికల్ టెస్టులు చేయించారు. వారిలో కొందరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా కేవలం కండ్లతో చూసి ఉద్యోగాలకు ‘అన్ఫిట్’ అని తేల్చడంతో.. ‘ఆ పోలీసు అభ్యర్థులు అన్ఫిట్?’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఈ అన్యాయంపై ఏడుగురు బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా ఏప్రిల్ 29న తీర్పు వచ్చింది. వారికి మళ్లీ గాంధీ లేదా ఉస్మానియా దవాఖాన వైద్యులతో 4 వారాల్లోగా మెడికల్ టెస్టులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు వచ్చి దాదాపు 20 రోజులు కావొస్తున్నా రాష్ట్ర పోలీసు నియామక బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేదని ఆ అభ్యర్థులు వాపోతున్నారు.
దీనిపై బోర్డు అధికారులను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా.. హైకోర్టు తీర్పు కాపీ తమకు ఇంకా అందలేదని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తున్నప్పటికీ వైద్య పరీక్షలు చేయాల్సింది తాము కాదని, వైద్యులే చేయాలని ఓ అధికారి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో తమకున్న చివరి అవకాశం కూడా చేజారి పోతుందేమోనని ఆ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. కాగా, ఈ అభ్యర్థుల పిటిషన్పై జూలై 10న తుది తీర్పు వెలువడనున్నది.