Supreme Court | లైంగిక దాడి అత్యంత క్రూరంగా జరగకపోయినా అనాగరికంగానే పిలుస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 2018ల ఆలయ ప్రాంగణంలో ఏడేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 30 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ రాజేశ్ జిందాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. పవిత్రమైన స్థలమని పట్టించుకోకుండా నిందితుడు అనాగరిక చర్యకు పాల్పడ్డాడని.. ఈ చర్య బాధితురాలిని జీవితాంతం వెంటాడుతుందని పేర్కొంది. దోషి శిక్షా కాలం పూర్తయ్యే వరకు జైలు నుంచి విడుదల చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు దోషికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది.
అయితే, నేరం అనాగరికం, క్రూరమైందని కాదని హైకోర్టు నమోదు చేసిందని పిటిషన్ వాదించారు. దోషికి నేరచరిత్ర లేనందున 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు కనీస జరిమానా మాత్రమే విధించాలని పిటిషనర్ వాదనలు వినిపించాడు. దీనికి సుప్రీంకోర్టు స్పందిస్తూ ఈ విషయంలో కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. కామకోరికను తీర్చుకునేందుకు బాలికను గుడికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడికి విధించిన రూ.లక్ష జరిమానా బాధితురాలికి ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఐపీసీలోని సెక్షన్ 376 ఏబీ కింద నేరం రుజువైన తర్వాత శిక్ష 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. బాధితురాలు ఏ గుడికి వెళ్లినా ఈ అనాగరిక చర్యే గుర్తుకు వస్తుందని గుర్తుంచుకోవాలని చెప్పింది. ఈ సంఘటన ఆమె భవిష్యత్ వైవాహిక జీవితంపై సైతం ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పేర్కొంది.