తిరువనంతపురం: కేరళలో ఏడేళ్ల బాలికకు రేబిస్ వ్యాధి సోకింది. ఆ అమ్మాయిని తిరువనంతపురంలోని శ్రీ అవిత్తమ్ తిరునల్ ఆస్పత్రిలోచేర్పించారు. వ్యాక్సిన్(Rabies Vaccination) తీసుకున్న తర్వాత కూడా ఆమెకు రేబిస్ సోకినట్లు గుర్తించారు. వ్యాక్సిన్ చివరి డోసు తీసుకోవడానికి ముందు వ్యాధి నిర్ధారణ జరిగింది.
నెల రోజుల క్రితం ఆ అమ్మాయిని ఇంటి ముందు ఓ కుక్క కరిచింది. ఆ సమయంలో ఆమె పేరెంట్స్ వెంటనే హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత తాలూక ఆస్పత్రికి తీసుకుపోయారు. గాయాలన్నీశుభ్రం చేసి ఆ పాపకువ్యాక్సిన్ ఇచ్చారు. జ్వరం వస్తున్నట్లు ఆ అమ్మాయి ఓ వారం క్రితం ఫిర్యాదు చేసింది. అవిత్తమ్ తిరునల్ ఆస్పత్రికి ఆ చిన్నారిని తరలించారు.
కొన్ని రోజుల క్రితం ఆరేళ్ల చిన్నారి కూడా రేబిస్ వ్యాధితో మలప్పురంలో చనిపోయింది. కుక్కలు దాడి చేసినప్పుడు ఒకవేళ వాటి దంతాలు రక్తనాళాలకు దిగితే అప్పుడు రేబిస్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటుందని అవిత్తమ్ తిరునల్ ఆస్పత్రి డాక్టర్ బిందు తెలిపారు.