Brain Activity | న్యూఢిల్లీ, మార్చి 9 : వైద్యపరంగా మనిషి మరణించిన తర్వాత కూడా మెదడు చురుగ్గానే ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. చనిపోయిన రోగుల మెదళ్లలో శక్తి పెరుగుదలను గుర్తించినట్టు వైద్య పరిశోధకులు వెల్లడించారు. ఇది దేహం నుంచి ఆత్మ నిష్క్రమణకు సంకేతం కావచ్చని ప్రతిపాదించారు. సంప్రదాయకంగా మేధో సంబంధ విధులను నిర్వర్తించే గామా మెదడు మనిషి మరణించే సమయంలోనూ చురుకుగా ఉంటుందని ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) పరీక్షల్లో తేలినట్టు అరిజోనా యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న అనస్థీషియాలజిస్టు డాక్టర్ స్టూవర్ట్ హామెరోఫ్ వెల్లడించారు. ఇది మరణానంతర స్పృహతోపాటు మరణానంతర జీవిత రహస్యంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని తెలిపారు.
మరణిస్తున్న నలుగురు రోగుల మెదళ్లను ఈ అధ్యయనంలో పరిశీలించినట్టు ‘ప్రాజెక్ట్ యూనిటీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ రోగుల్లో జీవ సంబంధమైన ఇతర సంకేతాలేమీ లేకపోయినప్పటికీ మెదడులో శక్తి పెరిగినట్టు ఈఈజీ రీడింగ్‌లో నమోదైందని, వారిలో రక్తపోటు, హృదయ స్పందన సహా ఇతర శారీరక విధులన్నీ ఆగిపోయిన తర్వాత కూడా మెదడు చురుకుగానే ఉన్నట్టు తేలిందని వివరించారు. ఇది వారు మరణానికి చేరువయ్యారు అని అనడానికి లేదా వారి దేహాలను ఆత్మ విడిచిపెట్టడానికి సంకేతం కావచ్చని పేర్కొన్నారు.