Electric Vehicle | న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ఎలక్ట్రిక్ వాహనాలను గృహాలకు అవసరమయ్యే విద్యుత్తును నిల్వచేసే బ్యాటరీలుగా ఉపయోగించుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్టు జర్మనీకి చెందిన ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. బైడైరెక్షనల్ చార్జింగ్ టెక్నాలజీని విస్తృత స్థాయిలో వినియోగించడం ద్వారా జర్మనీ, ఫ్రాన్స్ లాంటి యూరోపియన్ దేశాలకు భారీగా లబ్ధి చేకూరుతుందని ఆ అధ్యయనం పేర్కొన్నది.
సోలార్ ప్యానళ్ల లాంటి మైక్రో జనరేషన్ టెక్నాలజీలను ఈ వ్యవస్థకు జోడిస్తే గృహ విద్యుత్తు అవసరాలకు అయ్యే ఖర్చులో చాలా డబ్బు ఆదా కావడంతోపాటు సంప్రదాయ విద్యుత్తు కేంద్రాలపైన, ముఖ్యంగా శిలాజ ఇంధనాలపైన ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని పరిశోధకులు చెప్తున్నారు. జర్మనీలో విద్యుత్తు వాహనాలను రోజుకు సగటున దాదాపు గంటసేపు మాత్రమే ఉపయోగిస్తున్నారని, ఈ అధ్యయనంలో తేలింది.