వయనాడ్: వయనాడ్లో కొండచరియలు(Wayanad landslides) విరిగిపడటానికి .. అధిక వర్షపాతమే కారణం. కొండచరియలు విరిగిపడ్డ ముండక్కి ప్రాంతంలో భీకరంగా వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారుజామున రికార్డు స్థాయిలో వర్షం నమోదు అయ్యింది. కేవలం 48 గంటల్లో అక్కడ 572 మిల్లీమీటర్ల వర్షం రికార్డు అయ్యింది. ఇది వాతావరణశాఖ అంచనాల ప్రకారం చాలా చాలా ఎక్కువ. సాధారణంగా ఒక రోజు 204.4 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే, అప్పుడు ఆ వర్షం అతి తీవ్రంగా కురిసినట్లు లెక్క వేస్తారు. కానీ వయనాడ్లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షం ఆ రికార్డులను తిరగరాసింది.
తొలి 24 గంటల్లో 200 మిల్లీమీటర్ల వర్షం నమోదు అయినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఆ తర్వాత 24 గంటల్లో 372 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు ఆయన చెప్పారు. తొలి కొండచరియ విరిగిపడిన ముండక్కిలోని పుంచిరివట్టోంలో బీభత్సం సృష్టించింది. ల్యాండ్స్లైడ్ వల్ల అక్కడ 106 మంది మరణించారు. అయితే అక్కడి శిథిలాలు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చూరల్మాలా అంగడిలో పడ్డాయి.అక్కడ రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నవారు ప్రాణాలను రక్షించుకున్నట్లు సీఎం విజయన్ తెలిపారు.