న్యూఢిల్లీ : కేవలం ఒక్క లాగిన్తోనే ఖాతాదారులు తమ ఖాతా వివరాలను తెలుసుకునే సౌకర్యాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రవేశపెట్టింది. బహుళ లాగిన్లు అవసరం లేకుండా సభ్యుల పోర్టల్‌లోనే తమ లావాదేవీలను తెలుసుకునేందుకు ‘పాస్‌బుక్ లైట్’ పేరిట కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ వివరాలు మరింత సులభతరంగా తెలుసుకునే వీలు కలుగుతుంది. అంతకుముందు సభ్యులు తమ ఖాతా బ్యాలెన్స్, విత్‌డ్రాలు, జమవుతున్న వాటాల గురించిన వివరాలు తెలుసుకోవాలంటే ప్రత్యేక పాస్‌బుక్ పోర్టల్‌కు వెళ్లాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం సభ్యుల పోర్టల్‌లోనే ఈ వివరాలను తెలుసుకునే సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఒక్క లాగిన్తోనే తమ ఖాతాకు సంబంధించిన వివరాలను సభ్యులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
ఇది బహుళ లాగిన్ల అవసరాన్ని, సంక్లిష్టతను తగ్గిస్తుంది. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. డాటా గ్రాఫిక్స్, వివరణాత్మకంగా తమ ఖాతా వివరాలు కోరుకునే సభ్యులకు ఇప్పటికే ఉన్న పాస్‌బుక్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మరో ముఖ్యమైన సంస్కరణను ఈపీఎఫ్ఓ సభ్యులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే అనెగ్జర్ కే (బదిలీ సర్టిఫికెట్). ఇది సభ్యుల పోర్టల్ నుంచే లభ్యమవుతుంది. అంతకుముందు ఉద్యోగులు తమ జాబ్ మారినప్పుడు ఫారం 13 ద్వారా తమ పీఎఫ్ బదిలీ చేసేవారు. ఈ బదిలీ సభ్యుల విన్నపంపై కేవలం పీఎఫ్ కార్యాలయాల ద్వారా మాత్రమే జరిగేది. ఇప్పుడా ఇబ్బంది లేకుండా సభ్యులే నేరుగా అనెగ్జర్ కేను పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని పూర్తి పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపట్టవచ్చు.