EPFO : ఈపీఎఫ్వో వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సదుపాయం ఏటీఎం విత్డ్రా. ఈ సౌకర్యం గురించి కేంద్ర ప్రభుత్వం చాలాకాలం క్రితమే ప్రకటించింది. ఇటీవలే దీనికి సంబంధించి టెస్టింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల చివరిలోపు ఈపీఎఫ్ అమౌంట్ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ సూచనప్రాయంగా వెల్లడించారు. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని ఆయన అన్నారు. ఈపీఎఫ్వో 3.0 కింద ఈ కొత్త విధానం అమలుకానుంది. ఈ సదుపాయం అమలులోకి వస్తే ఈపీఎఫ్ డబ్బును త్వరగా విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా డిజిటల్ పద్ధతిలోనే జరుగుతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ పూర్తై, అనుమతి లభిస్తే నగదును త్వరగా యూపీఐ ద్వారా లేదా ఈపీఎఫ్వో ఎనేబుల్డ్ ఏటీఎంల ద్వారా డ్రా చేసుకోవచ్చు. కొత్త రూల్స్ ప్రకారం ఈపీఎఫ్ అకౌంట్లలోని 75 శాతం డబ్బును ఇలా తమ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యూపీఐ లేదా ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ విధానాన్ని కేంద్రం అమలు చేయబోతుంది. ఓటీపీ ద్వారా ఇలా నగదు ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతుంది.
గతంలో ఈపీఎఫ్ నగదు జమ చేసుకునేందుకు చాలా సమయం పట్టేది. కొన్నిసార్లు రెండు, మూడు వారాలు కూడా పట్టేది. కానీ, ఇప్పుడు త్వరగా, ఏటీఎం లేదా యూపీఐ ద్వారా నగదును ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్వో ప్రకారం ఒక ఉద్యోగి పెన్షన్ పొందాలంటే కనీసం పదేళ్లపాటు పని చేసి ఉండాలి. అంటే పీఎఫ్ అకౌంట్ పదేళ్లపాటు నిర్వహణలో ఉంటే వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. మరోవైపు ఈపీఎఫ్ వడ్డీని కేంద్రం ఈ నెలలోనే జమ చేయబోతుంది. ఈ ఏడాది ఈపీఎఫ్ వడ్డీ 8.5 శాతంగా వర్తించనుంది.