న్యూఢిల్లీ, నవంబర్ 11: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) పథకం కింద వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరగా 2014 సెప్టెంబర్‌లో ప్రభుత్వం వేతన పరిమితిని పెంచింది. ఎకనమిక్ టైమ్స్ వార్తా కథనం ప్రకారం ఉద్యోగుల సామాజిక భద్రతను పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయం అమలైతే ఉద్యోగులు ఈపీఎఫ్, ఉద్యోగి పింఛను పథకం(ఈపీఎస్)కు చెల్లించే వాటాపై ప్రభావం పడుతుంది.
భవిష్య నిధి చట్టాల ప్రకారం రూ.15 వేల కంటే ఎక్కువ మూల వేతనం కలిగినవారు ఈపీఎఫ్ పథకంలో భాగస్వాములైనా, ఈపీఎస్‌లో సభ్యులుగా చేరలేరు. అయితే ఇప్పుడు వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచితే మూల వేతనం రూ.15 వేల కంటే ఎక్కువ ఉన్నవారు ఈపీఎస్‌లో చేరేందుకు అర్హత పొందుతారు. ఈపీఎస్‌లో సభ్యులైన వారికి వారి యాజమాన్యం తరపున ఈపీఎఫ్ ఖాతాకు చెల్లించే వాటా తగ్గుతుందని గమనించాలి.