న్యూఢిల్లీ: కాలం చెల్లిన వాహనాలకు(EOL Vehicles) పెట్రోల్, డీజిల్ పోయరాదన్న కొత్త నిబంధనలను ఢిల్లీలో అమలు చేయనున్నారు. స్థానిక వాహనాలకే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే వెహికిల్స్ కు పెట్రోల్, డీజిల్ పోయరాదు అని నిర్ణయించారు. ఎండ్ ఆఫ్ లైఫ్(ఈఓఎల్) వాహనాలకు ఈ నిబంధన వర్తించనున్నది. రిజిస్ట్రేషన్ చేసి పదేళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్ల దాటిన పెట్రోల్ వాహనాలకు.. ఢిల్లీలో ఇంధనం పోయరు. జూలై ఒకటో తేదీ నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి రానున్నట్లు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎం) పేర్కొన్నది. ఏప్రిల్‌లోనే ఢిల్లీలో ఉన్న పెట్రోల్ పంపులకు మార్గదర్శకాలు జారీ చేశారు. జూలై ఒకటి నుంచి ఈఓఎల్ వాహనాలకు ఇంధనం పోయకూడదని ఆదేశించారు.
ఢిల్లీలో సుమారు 520 పెట్రోల్ బంకులు ఉన్నాయి. దాంట్లో 500 బంకుల్లో ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మిగితా వాటిల్లో జూన్ 30వ తేదీగా ఆ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పదేళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను ఆ కెమెరాలను గుర్తుపట్టేస్తాయి. ఢిల్లీతో పాటు అత్యధిక సంఖ్యలో వాహనాలు తిరిగే పరిసర ప్రాంతాలైన గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతం బుద్ నగర్, సోనిపట్‌లో కూడా నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన వర్తింపచేయనున్నారు. ఈ ప్రాంతాల్లో ఏఎన్పీఆర్ కెమెరాలను అక్టోబర్ 31వ తేదీ లోగా ఏర్పాటు చేయనున్నారు.
ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్న మిగితా జిల్లాలకు మరింత అదనపు సమయాన్ని కేటాయించారు. 2026, మార్చి 31వ తేదీ వరకు ఆ జిల్లాలకు మినహాయింపు కల్పించారు. ఆ జిల్లాల్లో ఉన్న పెట్రోల్ బంకులు అప్పటి వరకు కెమెరాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈఓఎల్ వాహనాలకు అక్కడ ఇంధన పోయరు. ఈఓఎల్ బస్సులు ఇండియాలో ఎక్కడ రిజిష్ట్రేషన్ అయినా.. వాటికి ఆయల్ పోయరని సీఏక్యూఎం సబ్యుడు వీరేందర్ శర్మ తెలిపారు. ఈ రూల్‌ను అమలు చేసేందుకు 100 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించే పెట్రోల్ స్టేషన్లపై కఠన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.
ఢిల్లీలో 62 లక్షల ఈఓఎల్ వాహనాలు ఉన్నాయి. వాటిల్లో 41 లక్షలు టూవీలర్లే. ఎన్సీఆర్ ప్రాంతంలో ఈఓఎల్ వాహనాల సంఖ్య 44 లక్షలు ఉంటుందని సీఏక్యూఎం తెలిపింది. వాహన్ డేటాబేస్ నుంచి ఏఎన్పీఆర్ కెమెరాల ఈఓఎల్ వాహనాలను గుర్తిస్తాయని శర్మ తెలిపారు.