న్యూఢిల్లీ: గోవాలో భారీ భూ కుంభకోణం బయటపడింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్‌ను గుర్తించారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) ఇవాళ పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. గురు, శుక్రవారాల్లో తనిఖీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా సోదాలు చేపట్టారు. రోహన్ హర్మాల్కర్ ఈ భూ కుంభకోణంలో కీలక సూత్రధారి అని తేలింది. వెయ్యి కోట్ల మేర విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రోహన్ హర్మాల్కర్ 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేవారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో అతను ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచాడు. భూ కుంభకోణం వెనుక అతనే మాస్టర్‌మైండ్ అన్న ఆరోపణలు వస్తున్నాయి. నిజమైన హక్కుదారులకు చెందిన భూమిని అక్రమ రీతిలో, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెవన్యూ రికార్డులను కూడా తారుమారు చేసినట్లు రోహన్‌పై కేసు బుక్కైంది. వ్యక్తిగత, ఫ్యామిలీ ఎస్టేట్లకు చెందిన భూముల్ని.. అక్రమ రీతిలో అమ్మేసి.. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.
అక్రమ భూ మార్పిడి కేసులను పరిష్కరించేందుకు గోవా సర్కారు 2022 జూన్ 15వ తేదీన సిట్‌ను ఏర్పాటు చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి ఆక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 100కుపైగా ఉన్న ప్రాపర్టీలకు చెందిన 44 ఎఫ్ఐఆర్లను సిట్ విచారించింది. పురావాస్తు శాఖకు చెందిన అధికారుల్ని ఈ కేసులో అరెస్టు చేసింది. ల్యాండ్ గ్రాబింగ్ కేసుల్ని విచారించేందుకు బాంబే హైకోర్టు మాజీ జస్టిస్ వీకే జాదవ్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.