న్యూఢిల్లీ, నవంబర్ 25: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను కేంద్ర ప్రభుత్వం మరింత శక్తిమంతం చేసింది. ఈ దర్యాప్తు సంస్థ పరిధిలోకి మరో 15 కేంద్ర మంత్రిత్వశాఖలు, సంస్థలను తీసుకొస్తూ ఈ నెల 22న ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని 66వ నిబంధనలో మార్పులు చేసింది. ఈడీ పరిధిలోకి తాజాగా విదేశాంగశాఖ, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, ఎన్ఐఏ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, స్టేట్ పోలీస్ విభాగాలు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ అకాడమీ, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ తదితర సంస్థలను తీసుకొచ్చారు.
సీవీసీతోపాటు క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఏ సంస్థలైనా ప్రాథమిక దర్యాప్తు చేసినా.. ఆ సమాచారాన్ని ఈడీ కోరితే ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొన్నది. పీఎంఎల్ఏ-2002లోని సెక్షన్ 66 ప్రకారం పై సంస్థల్లో వేటినైనా ఈడీ తగిన సమాచారం కావాలని అడిగే హక్కు ఉంటుంది. ఈడీ అడిగిన సమాచారాన్ని సదరు సంస్థ తప్పక ఇవ్వాల్సిందే.