Mahua Moitra | పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నారన్న ఆరోపణపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీలపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసినట్లు అధికార వర్గాలు చెప్పాయి. సీబీఐ ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ కేసులో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఎఫ్ఈఎంఏ) చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించారన్న కేసులో మహువా మొయిత్రా, హీరా నందానీలకు ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసినా.. వారిద్దరూ విచారణకు హాజరు కాలేదు. ఇదిలా ఉంటే, ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని మొయిత్రా ఇల్లు, ఇతర నగరాల్లో ఆమె కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.
అదానీ గ్రూపును, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు అడిగేందుకు హీరా నందానీ నుంచి మొయిత్రా రూ.2 కోట్ల నగదు, ఇతర బహుమతులు తీసుకున్నారని గతంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై లోక్ సభ ఎథిక్స్ కమిటీ నివేదిక ప్రకారం గత డిసెంబర్ లో మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు. అప్పట్లో తానే తప్పూ చేయలేదని ఆమె ఖండించారు. తన లోక్ సభ సభ్యత్వం రద్దు విషయమై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోక్ సభ ఎన్నికల్లో మరోసారి క్రుష్ణా నగర్ నుంచి మహువా మొయిత్రా పోటీ చేస్తున్నారు.