Karregutta Encounter | ములుగు, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ)/ కొత్తగూడెం ప్రగతిమైదాన్: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు చనిపోయినట్టు బస్తర్ ఐటీ సుందర్రాజ్ ధ్రువీకరించారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలే లక్ష్యంగా కర్రెగుట్టల్లో భద్రతాబలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జల్లెడపడుతున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయనేది పోలీసుల కథనం. అయితే, ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టు తొలుత ప్రచారం జరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఉద్ధృతం చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో తలదాచుకుంటున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టముట్టినట్టు వార్తలొస్తున్నాయి. మూడు రోజులుగా సీఆర్పీఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్, డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, బీఎస్ఎఫ్ బలగాలు వేల సంఖ్యలో మోహరించి అడవులను జల్లెడ పడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
మంగళవారం ప్రారంభమైన ‘కర్రెగుట్టల ఆపరేషన్’లో భద్రతా బలగాలకు చెందిన సుమారు పది వేల మంది పోలీసులు పాల్గొంటున్నట్టు సమాచారం. మావోయిస్టు అగ్రనేతలు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, మాస్టర్ మైండ్ హిడ్మా, దేవా, వికాస్ తదితరులు కర్రెగుట్టల్లో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో వారిని టార్గెట్‌గా చేసుకుని ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఆ ప్రాంతంలో హెలికాప్టర్ శబ్దాలతోపాటు కాల్పుల మోతలు వినిపిస్తున్నాయని సమీప గ్రామాల ప్రజలు చెప్తున్నారు.
వెంకటాపురం(నూగూరు), ఏప్రిల్ 24: మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్ర బలగాలు గత నాలుగు రోజులుగా కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న నేపథ్యంలో 15 మంది జవాన్లు వడదెబ్బకు గురైనట్టు తెలిసింది. గురువారం అస్వస్థతకు గురైన వారిని హెలికాప్టర్ సహాయంతో ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండల కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలలోని హెలిప్యాడ్ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ప్రభుత్వ దవాఖానకు తరలించినట్టు సమాచారం.
కాగా, 15 మంది జవాన్ల ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ రాలేదు. పోలీసులు ప్రభుత్వ దవాఖానలోకి మీడియాతోపాటు ఎవరినీ అనుమతించడం లేదు. ఇందుకు సంబంధించిన వివరాలను సైతం పోలీసులు వెల్లడించలేదు. వడదెబ్బకు గురైన జవాన్లందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. అయితే, కర్రెగుట్టల్లో మావోయిస్టులకు, కేంద్ర బలగాలకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో జవాన్లు గాయపడ్డారా? లేదా మండుతున్న ఎండల కారణంగా వడదెబ్బకు గురై అనారోగ్యం పాలయ్యారా? అనేది తెలియాల్సి ఉన్నది.