జమ్ము: జమ్ముకశ్మీరులోని కిష్టార్ జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ జూనియర్ కమిషన్డ్ అధికారి అమరుడయ్యారు. సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులను అడ్డుకున్నపుడు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నాయిబ్ సుబేదార్ రాకేశ్ కుమార్, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రాకేశ్ అమరుడు కాగా, మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌ను ఉగ్రవాదులు కిష్టార్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో హత్య చేశారు. ఆ ప్రదేశానికి కొద్ది దూరంలోనే ఆదివారం ఈ దారుణం జరిగింది. ఈ ప్రాంతంలో ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.