కొత్తగూడెం : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో ఓ మావోయిస్టు నేలకొరిగాడు. వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతాగుఫా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 150, 131 బెటాలియన్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తాసరపడి కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందినట్లు ఎస్పీ సునీల్ శర్మ దృవీకరించారు. మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక బర్మార్ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. మవోయిస్టుల వారోత్సవాల దృష్ట్యా పోలీస్ బలగాలు అడవుల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.