Encounter | జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్లోని సింగ్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని బలగాలు చుట్టుముట్టాయి. బలగాలను చూసి ఉగ్రవాదులు కాల్పులు జరుపడంతో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం సంఘటనా స్థలంలోనే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. సింగ్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా భద్రతా సంస్థలకు సమాచారం అందింది.
వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాంతో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. భద్రతా దళాలు సైతం కాల్పులు జరిపాయి. సంఘటనా స్థలంలో ముగ్గురు నుంచి నలుగురు వరకు ఉగ్రవాదులు నక్కినట్లుగా అనుమానిస్తున్నారు. పహల్గాం సంఘటనకు ముందు ఇదే ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఈ ప్రాంతం అనంత్‌నాగ్‌కు ఆనుకొని ఉంది. ఉగ్రవాదులకు జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.