తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని (Emergency) ప్రకటించారు. ముంబై నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) 657 విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో గురువారం ఉదయం 8 గంటలకు ఆ విమానం తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ విధించారు. విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు.
విమానంలో సిబ్బందితోపాటు 135 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారందరిని అందులో నుంచి ఖాళీ చేయించామన్నారు. ఉదయం 7.30 గంటలకు పైలట్‌కి బాంబు బెదిరింపు సమాచారం అందిందని, దీంతో అతడు తిరువనంతపురం విమానాశ్రయానిని సమాచారం చేరవేశాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని చెప్పారు. విమానాశ్రయంలో కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.