ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్’ సంస్థ ఫాల్కన్-9 రాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఇది పునర్వినియోగ రాకెట్. వ్యోమనౌకను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి తిరిగి భూమి మీదకు వచ్చి సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. తర్వాతి ప్రయోగాలకు ఉపయోగించుకోవచ్చు. లిక్విడ్ ఆక్సిజన్, రాకెట్ గ్రేడ్ కిరోసిన్‌ను ఇంధనంగా తీసుకొని తొమ్మిది మెర్లిన్ ఇంజిన్లతో నింగిలోకి దూసుకెళ్తుంది. 70 మీటర్ల పొడవు కలిగిన ఈ రాకెట్ మొత్తం బరువు 5,49,054 కిలోలుగా ఉంటుంది.
డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా స్పేస్ఎక్స్ సంస్థనే అభివృద్ధి చేసింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే ‘గ్రీస్’ పేరిట క్యాప్సుల్‌ను ఏర్పాటు చేశారు. శుభాన్షు బృందం ప్రయాణిస్తున్నది ఇందులోనే. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో లైఫ్ సపోర్టింగ్ వ్యవస్థ, టచ్‌స్క్రీన్ కంట్రోల్స్, కార్గో విభాగం (ఆహారం, పానీయాలు) వంటివి ఉంటాయి. భూమిమీద సురక్షితంగా ల్యాండ్ కావడానికి, సముద్ర ఉపరితలం మీద దిగడానికి ఓషన్ స్ప్లాష్‌డౌన్ రికవరీ వ్యవస్థలు ఉంటాయి.