SpaceX | న్యూఢిల్లీ, నవంబర్ 20 : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ సంస్థ బుధవారం ఓ భారీ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. చంద్రుడిపైకి వ్యోమగాములను, అంగారక గ్రహంపైకి సిబ్బందిని చేర్చేందుకు డిజైన్ చేసిన 400 అడుగుల పొడవైన ‘స్టార్‌షిప్’ రాకెట్‌ను దక్షిణ టెక్సాస్‌లోని స్టార్‌బేస్ కేంద్రం నుంచి ప్రయోగించింది. ఈ ప్రయోగంలో బహుళ ప్రయోజనార్థం వ్యూహాత్మకంగా ఓ అరటిపండును నింగిలోకి పంపింది. జీరో-గ్రావిటీ ఇండికేటర్ (శూన్య గురుత్వాకర్షణ సూచీ)లా పనిచేయడం ఈ అరటిపండు పోషించాల్సిన ప్రధాన పాత్ర. వ్యోమనౌక సూక్ష్మగురుత్వాకరణ (మైక్రోగ్రావిటీ)లోకి ప్రవేశించినప్పుడు ఆ విషయాన్ని దృశ్యమానంగా ప్రదర్శించేందుకు రోదసి యానంలో ఓ చిన్న వస్తువును ఉపయోగించడం సంప్రదాయమే.
వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకున్న క్షణాన్ని పరిశీలకులు సులభంగా గుర్తించేందుకు వీలుకల్పించే ఈ పద్ధతి ఎంతో సరళమైనది, ప్రభావవంతమైనది. కానీ, స్టార్‌షిప్ రాకెట్లో అరటిపండును పంపడం సంప్రదాయానికి మించిన చర్య. కార్గో పరీక్షలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని చాటుకోవడంతోపాటు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ)విభాగంతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునేందుకు, తద్వారా మున్ముందు రోదసిలోకి పంపే పేలోడ్లకు త్వరగా ఆమోదాన్ని పొందేందుకు, ‘స్పేస్ ఎక్స్’ సంస్థ ఈ సంప్రదాయేతర పేలోడ్ (అరటిపండు)ను ఉపయోగించింది.