Supreme Court | న్యూఢిల్లీ, నవంబర్ 7: ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, ప్రక్రియ మధ్యలో నియమాలు, అర్హతలు మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజస్థాన్ హైకోర్టులో అనువాదకుల ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన కేసులో 2023 జూలైలో జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మితల్, జస్టిస్ మనోజ్ మిత్రతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించింది. నియామక ప్రక్రియ మధ్యలో అర్హతలను మార్చవచ్చా అనే న్యాయపరమైన ప్రశ్నకు ధర్మాసనం స్పష్టతనిచ్చింది.
నియామక ప్రక్రియ మధ్యలో నియమాలను మార్చొద్దని కె.మంజుశ్రీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో 2008లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. ఈ తీర్పు సరైనదేనని, హర్యానా ప్రభుత్వం వర్సెస్ సుభాష్ చందర్ మర్వహ కేసులో 1973లో ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోలేదనే కారణంతో ఈ తీర్పును తప్పుగా భావించలేమని పేర్కొన్నది.
నిబంధనలు అనుమతిస్తే తప్ప నియామక ప్రక్రియ మధ్యలో అర్హతకు సంబంధించిన నియమాలు మార్చడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. దరఖాస్తులను ఆహ్వానించడంతో నియామక ప్రక్రియ మొదలవుతుందని, నియామకాలు పూర్తి చేయడంతో ముగుస్తుందని స్పష్టతనిచ్చింది. నియామకాలకు సంబంధించిన నియమాలు ఏకపక్షంగా ఉండొద్దని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది.