Electrocution : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కరెంటు వైరు తెగి రోడ్డుపై వరద నీటిలో పడటంతో విద్యుత్ షాక్ తగిలి ఓ యువతి మృతిచెందింది. ఆమెను కాపాండేందకు ప్రయత్నించి యువతి తండ్రి కూడా విద్యుత్ షాక్కు గురయ్యాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం హౌరా జిల్లాకు చెందిన షల్కియా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పూర్విదాస్ అనే యువతి తన స్నేహితురాలి పుట్టినరోజు పార్టీలో పాల్గొనేందుకు తన చెల్లెలుతో కలిసి వెళ్లింది. తిరిగి వచ్చేటప్పటికీ భారీ వర్షం కురువడంతో రోడ్లపై వరదనీరు పారుతోంది. ఆ వరద నీటిలో కరెంటు వైరు తెగిపడటంతో నీళ్లలో కాలు పెట్టగానే షాక్ తగిలింది. అక్కడే దుకాణంలో ఉన్న యువతి తండ్రి గమనించి కాపాడేందుకు ప్రయత్నించాడు.
కానీ అతనికి కూడా షాక్ తగిలింది. అక్కను చూసి ఆగిపోయిన మృతురాలి చెల్లెలు ప్రాణాలతో బయటపడింది. స్థానికులు కరెంట్ ఆఫ్ చేయించి తండ్రి కూతురు ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా పూర్విదాస్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.