Congress | జోధ్‌పూర్, ఆగస్టు 21: కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కరెంట్ కష్టాలతో అన్నదాతలు, ప్రజలు అల్లాడుతున్నారు. కర్ణాటకలో రోజూ 6 గంటల పాటు విద్యుత్తు కోతలు విధిస్తుండగా.. రాజస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. కోతల్లేకుండా వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా చేయాలని అన్నదాతలు రోడ్డెక్కారు. జోధ్‌పూర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(డిస్కమ్) వద్ద చేపట్టిన రైతుల ‘మహాపడావ్’ సోమవారంతో ఐదో రోజుకు చేరుకొన్నది. అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని, లో వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. ఎడాపెడా విద్యుత్తు కోతల విధిస్తుండటంతో.. నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తు సమస్యలపై జరిగిన చర్చలో డిస్కమ్ అధికారులు తగిన పరిష్కారం చూపకపోవడంతో రైతాంగం ఆందోళనకు దిగడం అనివార్యమైంది.
హామీలే తప్ప.. చర్యల్లేవ్
రైతుల ఆందోళనలకు భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) మద్దతు పలికింది. రైతుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని బీకేఎస్ రాజస్థాన్ కార్యదర్శి తుల్చా రామ్ సిన్వార్ స్పష్టం చేశారు. డిమాండ్లను గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారు తప్ప, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు. విద్యుత్తు కోతలు, లో వోల్టేజీ సమస్య కారణంగా నీరందక పంటలు ఎండిపోతున్నాయని, దిగుబడి దారుణంగా పడిపోతున్నదని సిన్వార్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్తు సరఫరాలో జోధ్‌పూర్ విద్యుత్తు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, దీని వలన ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యకం చేశారు. కాగా, రైతాంగం ఆందోళనపై రాష్ట్ర విద్యుత్తు మంత్రి భన్వర్ సింగ్ భటి స్పందిస్తూ అధికారులతో సంప్రదించి డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.
బెంగళూరులో నిత్యం కోతలే..
మరోవైపు ఇదే కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటకలో కరెంట్ కోతలు నిత్యకృత్యంగా మారాయి. రాజధాని బెంగళూరులోనే రోజులో 6-7 గంటల పవర్ కట్ పరిపాటిగా మారింది. గత బీజేపీ హయాంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. దీంతో విద్యుత్తు కోతలను పరిమితం చేస్తామని, ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి మూడు నెలల క్రితం గద్దెనెక్కిన కాంగ్రెస్.. సమస్యను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంది. కల్లబొల్లి హామీలను నమ్మి ఓటేసిన ప్రజలకు హస్తం పార్టీ విద్యుత్తు కోతలతో పట్టపగలే చుక్కలు చూపిస్తున్నది. దేశంలోని ఇతర బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదనే విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణలో వెలుగు జిలుగులు
తెలంగాణలో.. అటు రైతులకు, ఇటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందుతున్నది. కరెంట్ కష్టాలు అనే మాట లేకుండా రాష్ట్రంలోని పరిశ్రమలకు నిరంతరంగా విద్యుత్తు సరఫరా అవుతున్నది. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తుండటంతో.. రైతులకు గతంలో పడిన సాగునీటి బాధలు లేకుండా పోయాయి. గత పాలకుల హయాంలో కరెంట్ కోసం రోడ్డెక్కిన సందర్భాలు, పడిన ఇబ్బందులను రైతులు ఈ సందర్భంగా గుర్తుచేసుకొంటున్నారు. అంతరాయం లేని విద్యుత్తు సరఫరాతో వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలు, ఇతర వ్యాపారాలు పరుగులు పెడుతున్నాయి.
రైతుల డిమాండ్లు ఇవీ..
1. కోతలు లేకుండా వ్యవసాయానికి 7 గంటలు విద్యుత్తు సరఫరా చేయాలి.
2. విద్యుత్తు కనెక్షన్ల కోసం డబ్బు డిపాజిట్ చేసిన రైతులకు వెంటనే ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలి.
3. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే, రీప్లేస్ చేసేందుకు ప్రతి డివిజన్లో ఐదు ట్రాన్స్ఫార్మర్లు రిజర్వ్‌గా ఉంచుకోవాలి.