న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో విద్యుత్తు (సవరణ) బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సోమవారం వెల్లడించారు. విద్యుత్తు రంగంలో సంస్కరణలు, అప్పుల ఊబిలో చిక్కుకున్న విద్యుత్తు పంపిణీ కంపెనీలను లాభాలబాట పట్టించడం ఈ బిల్లు ఉద్దేశమని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో సోమవారం ఐఐటీ ఢిల్లీ-సీఈఆర్సీ-గ్రిడ్ ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా విలేకరులకు మంత్రి తెలిపారు. అనేక సంవత్సరాలపాటు నష్టాలను అనుభవిస్తున్న విద్యుత్తు పంపిణీ కంపెనీలు 2025లో సంయుక్తంగా రూ. 2,701 కోట్ల లాభాలను గడించినట్లు విద్యుత్తు మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. అయితే ఇప్పటికీ 50 డిస్కమ్‌లు నష్టాలను చవిచూస్తున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. అన్ని డిస్కమ్‌లు లాభాలు సంపాదించేందుకు వీలుగా వ్యూహాలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. విద్యుత్తు బిల్లును ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రైవేటీకరణ కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తెస్తున్నదని ఏఐపీఈఎఫ్ చైర్మన్ శైలేంద్ర దూబే మండిపడ్డారు.