న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లపై (Vande Bharat Train) విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వందే భారత్‌ను రైలును ఎలక్ట్రిక్ ఇంజిన్ లాగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అత్యంత వేగవంతమైన రైలుగా మోదీ సర్కార్ పేర్కొన్న వందే భారత్ రైలును, దశాబ్ధాల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ ఇంజిన్ లాగడంపై నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. జూన్ 22న ఆ రాష్ట్రంలోని సకల్దిహా రైల్వే స్టేషన్ వద్ద వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్ వేగంగా లాక్కెళ్లడాన్ని శశాంక్ జైస్వాల్ అనే వ్యక్తి చూశాడు. దీనిని తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ నేత కృష్ణ అల్లారావుతోపాటు మరికొందరు నెటిజన్లు స్పందించారు. ‘గత 9 సంవత్సరాల అబద్ధాలను 70 ఏళ్ల చరిత్ర లాగుతోంది’ అని కాంగ్రెస్ నేత కృష్ణ విమర్శించారు. మరి కొందరు నెటిజన్లు కూడా ఇలాంటి కామెంట్లు చేశారు. దశాబ్ధాల కిందట కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్, బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హైస్పీడ్ వందే భారత్ రైలును లాగడంపై పలు జోకులు వేశారు. ఈ వీడియో క్లిప్‌ను 9 లక్షల మందికిపైగా వీక్షించారు.
మరోవైపు వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై తూర్పు మధ్య రైల్వే స్పందించింది. ఖాళీ కోచ్‌లతో కూడిన వందే భారత్ రైలును ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో నడిపినట్లు తెలిపింది. కొత్త మార్గంలో ప్రారంభించే ముందు మరో ఇంజిన్ ద్వారా ట్రైల్స్ నిర్వహించినట్లు చెప్పింది. వందే భారత్ రైలును ప్రారంభించిన తర్వాత లోకో పైలట్, సిబ్బంది దానిని నడుపుతారని పేర్కొంది.
पीछले 9 सालों के झूठ को खींच कर ले जाता 70 सालों का इतिहास👇 pic.twitter.com/WwdCIj7cQL
— Krishna Allavaru (@Allavaru) June 29, 2023