Naveen Patnaik | సరిగ్గా 24 ఏండ్ల క్రితం బీజేపీ మద్దతుతో ఒడిశాలో తొలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్.. తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలోనే ఓటమి పాలయ్యారు. 2000లో ఒడిశా సీఎంగా ప్రమాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ 24 ఏండ్ల పాటు సీఎంగా కొనసాగి చరిత్ర సృష్టించిన నవీన్ పట్నాయక్ రికార్డుకు బ్రేక్ పడింది.
నవీన్ పట్నాయక్ సర్కార్ పట్ల ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి బీజేపీ దూకుడుగా ప్రచారం చేసింది. ఫలితంగా 147 స్థానాల ఒడిశా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సంపాదించడంలో నవీన్ పట్నాయక్ విఫలం అయ్యారు. తమిళనాడుకు చెందిన బ్యూరోక్రాట్ వీకే పాండ్యన్ ఇటు ప్రభుత్వ, అటు పార్టీ వ్యవహారాల్లో జోక్యం పట్ల ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువెత్తింది. ఫలితంగా మరోసారి సీఎంగా ఎన్నికై, ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన రికార్డును సాధించలేకపోయారు. 147 స్థానాలు గల ఒడిశా అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లలో విజయఢంకా మోగించింది. బీజేడీ మాత్రం 51 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. రెండు స్థానాల్లో పోటీ చేసిన నవీన్ పట్నాయక్ ఒక్క స్థానంలోనే విజయం సాధించారు.
జనతాదళ్ నేత బిజూ పట్నాయక్ తనయుడే నవీన్ పట్నాయక్. బిజూ పట్నాయక్ కూడా ఒడిశా సీఎంగా పని చేసినా.. తండ్రి హయాంలో రాష్ట్రానికి, రాజకీయాలకు దూరంగా ఉన్నారు నవీన్ పట్నాయక్. కవిగా జీవనం సాగిస్తున్న నవీన్ పట్నాయక్.. తన తండ్రి మరణం తర్వాత 1997లో బిజూ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు. 1998లో జరిగిన లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2000లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో బీజేడీ గెలుపొందడంతో నవీన్ పట్నాయక్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, తొలిసారి సీఎంగా ప్రమాణం చేశారు. నాటి నుంచి 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూ వచ్చారు.