బెంగళూరు, మార్చి 9: మరో అయిదారు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశా రు. రాష్ట్రపతి వెంటనే దాన్ని ఆమోదించారు. ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ పదవీకా లం 2027 వరకు ఉన్నది. మాజీ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ 2022, నవంబర్ 21న ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
అప్పట్లో ఆయన కేంద్ర భారీ పరిశ్రమల కార్యదర్శిగా పనిచేయటంతో ఎన్నికల కమిషనర్‌గా ఆయన నియామకం వివాదాస్పదమైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) చట్టం, 2023లోని సెక్షన్ 11లోని క్లాజ్ (1) ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా ఎలక్షన్ కమిషనర్ ఎప్పుడైనా తమ రాజీనామాను రాతపూర్వకంగా రాష్ట్రపతికి పంపవచ్చు. అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేయడంతో ప్యానెల్లో సీఈసీ రాజీవ్‌కుమార్ మాత్రమే మిగిలారు.