న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) నిర్వహించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) నిర్ణయం కాదా? మరి ఇది ఎవరు తీసుకున్న నిర్ణయం? సర్ నిర్వహణకు సంబంధించిన నిర్ణయం వెనుక ఈసీఐ లేదన్న విషయం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద బయటకు వచ్చింది. ఆర్టీఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్ అడిగిన ప్రశ్నకు ఈసీఐలోని ప్రిన్సిపల్ కార్యదర్శి జవాబు ఇస్తూ సర్పై నిర్ణయం కమిషన్ తీసుకోలేదని స్పష్టం చేశారు.
సర్ నిర్వహించాలని ఈసీఐ నిర్ణయం తీసుకోకపోతే మరి ఎవరు తీసుకున్నారు? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు ఈసీఐ సరైన సమాధానమే ఇచ్చిందని అనుకుంటే మరి సర్ నిర్వహణ వెనుక కేంద్ర ప్రభుత్వమే ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. భారీ స్థాయిలో వ్యయం, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా లక్షలాది సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగుల సమీకరణతో ముడిపడిన ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈసీఐ సొంతంగా తీసుకునే అవకాశం మాత్రం లేదు.