న్యూఢిల్లీ, జూన్ 1: కోట్లాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో నిజమైన విజేతలు ఓటర్లేనని చాటుకున్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నిర్వహణలో అనేక సవాళ్లు, సందేహాలను అధిగమించి పెద్దయెత్తున పోలింగ్ స్టేషన్లకు తరలివచ్చి ఓటు వేశారని తెలిపింది. ఏప్రిల్ 19న ప్రారంభమైన మొదటి విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియ శనివారం జరిగిన ఏడో విడత ఎన్నికలతో విజయవంతంగా ముగిసింది. దీంతో ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. పోలింగ్ విజయవంతంగా ముగియడానికి సహకరించిన ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు, రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలిపింది.