Southwest Monsoon | న్యూఢిల్లీ: కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టుగా.. ఈసారి రుతుపవనాలు నెమ్మదించడానికి సైతం ఎల్నినోతోపాటు మరెన్నో కారణాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు 2026 జూన్ 4న భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత ఒక అడ్డంకిని ఎదుర్కొన్నాయి. దేశవ్యాప్తంగా ఈ అసాధారణ జాప్యానికి ఏదో ఒక కారకం కాకుండా అనేక వాతావరణ వ్యవస్థల సంక్లిష్టమైన పరస్పర చర్యే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రారంభంలో చురుగ్గా కదిలిన రుతుపవనాల పురోగతి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా నెమ్మదించింది. దీనివల్ల లోటు వర్షపాతం ఏర్పడి రైతులు, నీటి నిర్వాహకుల్లో ఆందోళనలను పెంచింది. నైరుతి రుతుపవనాల మందగమనానికి ముఖ్యంగా ఐదు ప్రధాన అడ్డంకులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పసిఫిక్ అలజడులు, పశ్చిమ అలజడులు, బలహీనమైన అల్పపీడన ద్రోణులు ఏర్పడటం, మ్యాడెన్-జూలియన్ అసిలేషన్(ఎంజేవో) నుంచి మద్దతు లేకపోవడం, కొత్తగా పుట్టుకొస్తున్న ఎల్నినో.. వీటన్నింటి కలయికే దీనికి కారణమని వాతావరణ నిపుణులు ఇప్పుడు భావిస్తున్నారు. జూన్ ప్రారంభంలో హిందూ మహాసముద్రంపై రుతుపవనాల జోరు పెరిగింది. అయితే దాని శక్తిలో కొంతభాగం పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణమండల వాయు ప్రసరణలతో ముడిపడి ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇందులో భాగంగానే ఒక వాతావరణ వ్యవస్థ తర్వాత బలపడి జగ్మీ తుఫానుగా మారింది. సాధారణంగా భారతదేశంలో రుతుపవనాల పురోగతికి ఊతమిచ్చే అల్పపీడన వ్యవస్థ బంగాళాఖాతంలో ఏర్పడడానికి సహాయపడాల్సింది పోయి ఈ వాతావరణ శక్తిలో కొంతభాగం తూర్పు వైపునకు మళ్లించబడింది.
అదే సమయంలో పశ్చిమ అలజడులు పదేపదే ఉత్తర భారతదేశం మీదుగా అసాధారణంగా దక్షిణాది వైపునకు దూసుకొచ్చాయి. ఈ వాతావరణ వ్యవస్థలు నిరంతరాయంగా పొడి ఉత్తర-పశ్చిమ గాలులను ఈ ప్రాంతంలోకి మోసుకొచ్చాయి. ఇది విస్తారంగా మేఘాలు ఏర్పడటానికి, వర్షాలు కురవడానికి ఏమాత్రం అనుకూలించని ప్రతికూల వాతావరణాన్ని సృష్టించింది. ఉపఖండం అంతటా విస్తరించి ఉండే తక్కువ పీడన పట్టీ అయిన రుతుపవన ద్రోణి కూడా సాధారణ స్థితికి భిన్నంగా ప్రవర్తించింది. ఈ ద్రోణి వెంబడి ఒక చక్రవాత ప్రసరణ ఏర్పడింది. కానీ అది బంగాళాఖాతం నుంచి తేమను దేశం లోపలికి లాగడానికి బదులుగా, చాలావరకు తక్కువ ఎత్తులో వీచే గాలులను ఆ ద్రోణి చుట్టూనే తిరిగేలా చేసింది.
ఇది ఉరుములతో కూడిన మేఘాలు సమర్థవంతంగా కేంద్రీకృతం కాకుండా అడ్డుకుంది. అలాగే ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడటాన్ని కూడా కష్టతరం చేసింది. పసిఫిక్ అలజడులు మరింత బలపడటంతో పరిస్థితి మరింత క్షీణించింది. మరోవైపు బలపడుతున్న ఎల్నినో ప్రభావం నిరంతరాయంగా మేఘాలు దట్టంగా అల్లుకోవడానికి అవసరమైన వాతావరణాన్ని మరింత బలహీనపరిచింది. కేవలం ఎల్నినో ఒక్కటే రుతుపవనాలను పూర్తిగా ఆపలేకపోయినప్పటికీ, విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే పరిస్థితులను ప్రతికూలంగా మార్చగలదు. ఇక లోపించిన మరో ముఖ్యమైన అంశం.. ప్రపంచవ్యాప్తంగా తిరిగే ఉష్ణమండల వర్షపాత తరంగం అయిన మ్యాడెన్-జూలియన్ అసిలేషన్(ఎంజేవో).

El Nino
ఎంజేవో అనేది భూమధ్యరేఖ వెంబడి తూర్పుదిశగా కదిలే మేఘాలు, వర్షాలు, పీడన వ్యవస్థ. ప్రతి 30 నుంచి 60 రోజులకోసారి భూమిని చుట్టేసే ఈ వాతావరణ కదలిక మన తెలుగు రాష్ర్టాల్లోని రుతుపవనాల తీవ్రతను, వర్షపాతాన్ని, సముద్రపు తుఫానులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. జూన్ మొదటి సగభాగంలో ఈ ఎంజేవో అనుకూలించని దశలో ఉండిపోయింది. దీనివల్ల హిందూ మహాసముద్రంపై మేఘాలు ఏర్పడటానికి ఎటువంటి మద్దతు లభించలేదు. మధ్యలో వచ్చిన ఒక చిన్న రుతుపవన ఉధృతి పశ్చిమ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం ముందుకు సాగడానికి సహాయపడింది. కానీ ఆ జోరు ఎక్కువకాలం నిలువలేదు.
రుతుపవనాల గమనాన్ని ఒకచోట నిలిపి ఉంచే అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడకపోవడం, అలాగే పొడిగాలి పదేపదే తిరిగి రావడం వల్ల ఈ ఉధృతి బలహీనపడి మళ్లీ దక్షిణ వైపునకు ముఖం చాటేసింది. అయితే రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు మెరుగవుతాయని అంచనా వేస్తున్నారు. జూన్ నాలుగో వారంలో ఎంజేవో అనుకూలమైన దశలోకి ప్రవేశిస్తుందని, అదేసమయంలో తక్కువ ఎత్తులో వీచే గాలుల ప్రవాహం, భూమధ్యరేఖను దాటి వచ్చే గాలులు, ఎగువస్థాయి తూర్పు గాలులు బలపడతాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పులన్నీ కలిసి దేశంలో నిరంతరాయంగా కొనసాగుతున్న పొడిగాలుల చొరబాట్లను ఎట్టకేలకు అడ్డుకుని, భారతదేశమంతటా రుతుపవనాలు మళ్లీ నిజమైన రీతిలో పుంజుకోవడానికి దోహదపడవచ్చు.