Maharashtra | రెండు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీల వైపే ఓటర్లు నిలబడ్డారు. మహారాష్ట్రలో మహాయుతికి, జార్ఖండ్‌లో జేఎంఎం కూటమికి మరోసారి అధికారాన్ని కట్టబెట్టారు. మహారాష్ట్రలో 233 స్థానాలు గెలిపించి మహాయుతికి మరోసారి అధికారాన్ని అందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి భారీ విజయాన్ని కట్టబెట్టారు. లోక్‌సభ ఫలితాలను రిపీట్ చేస్తూ అధికారం దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ఆశలు ఆడియాశలయ్యాయి. మూడు పార్టీలు కలిసినా 49 స్థానాలకే పరిమితమై హస్తం కూటమి చతికిలపడింది. మరోవైపు జార్ఖండ్ జనం హేమంత్ సొరేన్‌కు జైకొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జేఎంఎం కూటమిని 56 స్థానాల్లో గెలిపించి అధికారంలో కూర్చోబెట్టారు. జార్ఖండ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న కమలం ప్రయత్నాలు ఫలించలేదు.
Maharashtra | ముంబై, నవంబర్ 23: మహాయుతికే మహారాష్ట్ర ప్రజలు జైకొట్టారు. హోరాహోరీ అనుకున్న పోరులో ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. 288 నియోజకవర్గాలకు గానూ 233 స్థానాల్లో గెలిపించి మళ్లీ అధికారంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీకి దారుణ ఓటమిని మిగిల్చారు. లోక్‌సభ ఫలితాలను పునరావృతం చేసి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకున్న అఘాడీ కేవలం 49 స్థానాలకే పరిమితమైంది. 101 స్థానాల్లో పోటీ చేసి కూటమిలో పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ అతి కష్టమ్మీద కేవలం 15 స్థానాలనే గెలుచుకుంది. మాజీ ముఖ్యమంత్రులు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌కు ఎన్నికల ఫలితాలు రాజకీయంగా కోలుకోలేని దెబ్బకొట్టాయి. మహాయుతి హవాలో చిన్న పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ప్రతిపక్షంలో ఏ పార్టీకీ 10 శాతం సీట్లు దక్కకపోవడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయాయి.
మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో చేదు ఫలితాలు పొందిన మహాయుతి కూటమి తిరిగి పుంజుకుంది. ఆరు నెలల్లోనే ప్రజాతీర్పును అనుకూలంగా మార్చుకొని ఘన విజయాన్ని సాధించింది. ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ కాంబో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అజిత్ పవార్ రూపంలో కూటమికి అదనపు బలం చేకూరింది. ‘ఏక్ హైతో సేఫ్ హై’ అంటూ ఇచ్చిన నినాదం ఫలించింది. లడ్కి బహిన్ యోజన వంటి పథకాలు ఓట్లు కురిపించాయి. దీంతో 288 స్థానాలకు గానూ 233 స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 149 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఏకంగా 132 స్థానాలను దక్కించుకుంది. 81 స్థానాల్లో పోటీ చేసిన సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 స్థానాల్లో విజయం సాధించింది. అజిత్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో బరిలో నిలిచి 41 చోట్ల గెలిచింది. మహాయుతిలోని జన్ సురాజ్య శక్తి రెండు స్థానాల్లో, రాష్ట్రీయ యువస్వాభిమాన్ పార్టీ ఒక స్థానంలో, రాజర్షి షాహు వికాస్ అఘాడీ ఒక స్థానంలో గెలుపొందాయి.
మరాఠా ఓటర్లు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)కి ఘోర ఓటమిని కట్టబెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ కూటమి ఇచ్చిన హామీలను జనం నమ్మలేదు. లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకు గానూ 30 స్థానాలు ఇచ్చి జై కొట్టిన ఓటర్లే ఇప్పుడు మొఖం చాటేశారు. దీంతో 288 స్థానాలకు గానూ కేవలం 49 స్థానాలకే ఎంవీఏ పరిమితమైంది. కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేసిన కేవలం 16 స్థానాలనే దక్కించుకుంది. శివసేన(యూబీటీ) 95 స్థానాల్లో బరిలో నిలిచి కేవలం 20 స్థానాలను గెలుచుకుంది. 86 చోట్ల పోటీ చేసిన ఎన్సీపీ(ఎస్పీ) 10 స్థానాల్లో విజయం సాధించింది. ఈ కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ రెండు స్థానాలను, పీడబ్ల్యూపీఐ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. కాంగ్రెస్ తరపున పీసీసీ చీఫ్ నానా పటోలే, మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్, కీలక నేత బాలాసాహెబ్ థోరట్ ఓటమిపాలయ్యారు.
మహాయుతి హవాలో చిన్న పార్టీలు సైతం కొట్టుకుపోయాయి. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ 125 స్థానాల్లో, ప్రకాశ్ అంబేద్కర్ నాయకత్వంలోని వీబీఏ 200 నియోజకవర్గాల్లో పోటీ చేయగా ఒక్క చోటా విజయం సాధించలేదు. రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే ఓడిపోయారు. 17 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం మాలేగావ్ సెంట్రల్ స్థానంలో మాత్రమే 75 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది.
శివసేన, ఎన్సీపీ భవిష్యత్తుపైనా ఆయా పార్టీల ఓటర్లు ఈ ఎన్నికల ద్వారా స్పష్టతనిచ్చారు. శివసేనను చీల్చి అధికారం చేపట్టిన ఏక్నాథ్ షిండేకు, ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్‌కే జై కొట్టారు. తమవే అసలైన పార్టీలని ఇప్పటికే కోర్టులో నిరూపించుకున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ప్రజామోదాన్ని సైతం పొందినట్టయ్యింది. ఐదు దశాబ్దాలుగా మరాఠా రాజకీయాల్లో కీలకంగా నిలిచిన ఠాక్రే కుటుంబం, శరద్ పవార్‌కు ఈ ఫలితాలు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాయి. ఎన్నికల్లో ఇద్దరు నేతల ప్రభావం కనిపించలేదు. పార్టీల్లో తిరుగుబాట్ల వల్ల ప్రజా సానుభూతిని వీరు పొందలేకపోయారు.