Eknath Shinde | ముంబై, ఫిబ్రవరి 21 : మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో విభేదాలు ముదిరాయన్న ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్‌నాథ్‌షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిర్వహిస్తున్న సమావేశాలకు ఇటీవల దూరంగా ఉంటున్న షిండే.. 2022లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం పతనమైన విషయాన్ని గుర్తుచేశారు.
అప్పట్లో తనను తేలిగ్గా తీసుకోవడం వల్లే ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసినట్టు చెప్పారు. తాను బాలా సాహెబ్ కార్యకర్తనన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని, గతంలో తనను తేలిగ్గా తీసుకోవడం వల్లనే ఎంవీఏ ప్రభుత్వాన్ని గద్దెదింపానని విలేకర్లతో అన్నారు. 40 మంది ఎమ్మెల్యేలతో శివసేనను చీల్చి ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చేసిన షిండే.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.