ముంబై: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ‘నువ్వుంటావో, నేనుంటానో తేల్చుకుందాం’ అని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఈ మేరకు ఆయన సవాల్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేను జైలుకు పంపేందుకు ఫడ్నవీస్ ప్రయత్నిస్తున్నారని ఎన్సీపీ (ఎస్పీ) నేత అనిల్ దేశ్‌ముఖ్ ఇటీవల ఆరోపించారు. బుధవారం ముంబైలోని రంగశారదా ఆడిటోరియంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే దీనిపై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివసేన (యూబీటీ), బీజేపీ మధ్య వివాదం మరింత తీవ్రమవుతుందని అన్నారు.
కాగా, బీజేపీని దొంగల గుంపుగా ఉద్ధవ్ ఠాక్రే అభివర్ణించారు. ‘ఇప్పుడు కూడా, పార్టీని వీడాలనుకునే వారు వెళ్లిపోవడాన్ని స్వాగతిస్తా. మాజీ కౌన్సిలర్లు కావాలనుకుంటే వెళ్లిపోవచ్చు. నా శివసైనికులతో కలిసి నేను పోరాడతా. ‘నువ్వు ఉంటావా? నేను ఉంటానా?’ అన్న సంకల్పంతో పోరాటంలోకి దిగా. తన బంధుమిత్రులంతా ఎదురుగా ఉండడం చూసి అర్జునుడికి బాధ కలగడం సహజమని గీతలో చెప్పారు. నాకు కూడా అదే అనిపించదా? నిన్న మొన్నటి వరకు నాతో ఉన్న వారు ఇప్పుడు నా ఇంటిపై దాడికి వస్తున్నారు. నన్ను, ఆదిత్యను ఎలాగైనా జైలులో పెట్టడానికి ఫడ్నవీస్ పన్నాగం పన్నినట్లు అనిల్ దేశ్‌ముఖ్ నాకు చెప్పారు. వీటన్నింటిని భరిస్తూ గట్టిగా నిలబడ్డా. ‘మీరైనా ( ఫడ్నవీస్) ఉండాలి లేదా నేనుండాలి’. ఇప్పటికీ నా దగ్గర అధికారిక పార్టీ, గుర్తు లేదా డబ్బు లేదు. కానీ మీ (శివసైనికుల) బలం మీద మాత్రమే నేను ప్రతి ఒక్కరినీ సవాల్ చేస్తున్నా’ అని అన్నారు.
మరోవైపు ప్రధాని మోదీకి కూడా చెమటలు పట్టే విధంగా లోక్‌సభ ఎన్నికల్లో పోరాడినట్లు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు చివరి పోరాటమని చెప్పారు. ‘ఇది మాకు చివరి సవాలు. దీని తరువాత ఎవరూ మాకు సవాలు చేయలేరు. వారు మా పార్టీని, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు. ఇప్పుడు మనకు సవాల్‌గా నిలుస్తున్నారు. శివసేన తుప్పు పట్టిన కత్తి కాదు. మెరిసే కత్తి. ముంబైని కాపాడుకోవడానికి పోరాడాల్సి వచ్చింది. ఇద్దరు వ్యాపారవేత్తలు ఇదంతా చేస్తున్నారు. వారి మనస్తత్వాన్ని పూర్తిగా నిర్మూలించాలి’ అని అన్నారు.
उद्धव ठाकरे
अनिल देशमुख ने बताया की कैसे मुझे और आदित्य को जेल में डालने की साजिश फडणवीस ने रचा था.. सबकुछ सहन करके मैं जिद के साथ खड़ा हूं.. या तो तुम रहोगे या फिर मैं रहूंगा#UddhavThackeray #ShivSena #DevendraFadnavis pic.twitter.com/TnsipRqxym
— Dinesh Mourya (@dineshmourya4) July 31, 2024