Road Accident : హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ టూరిస్టు ట్యాక్సీ (Tourist Taxi) అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో బెంగళూరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రెండు కుటుంబాల వాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చంబా జిల్లాలోని బైరాగఢ్-సచ్ పాస్ (Biragarh-suchpass) మార్గంలో కాలాబన్ (Kalaban) సమీపంలో ఈ విషాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మరో కుటుంబం వేసవి సెలవుల కోసం డల్హౌసీ హిల్ స్టేషన్‌కు వచ్చారు. అక్కడే ఓ ట్యాక్సీని అద్దెకు తీసుకుని, మంచు పర్వతాలను చూసేందుకు శుక్రవారం సచ్ పాస్ మార్గంలో బయలుదేరారు. అయితే వారు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ట్యాక్సీ యజమాని వాహనానికి ఉన్న జీపీఎస్ సిగ్నల్‌ను ట్రాక్ చేశాడు. కాలాబన్ సమీపంలో వాహనం కదలకుండా ఒకే చోట ఉన్నట్లు చూపించడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు. పరిశీలనలో వాహనం లోయలో పడిపోయినట్లు తేలింది.
ప్రమాదం జరిగిన ప్రాంతం మారుమూల ప్రాంతం కావడం, అక్కడ ఎలాంటి మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఘటనపై హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎనిమిది మందితో వెళ్తున్న వాహనం లోయలో పడిపోవడం అత్యంత బాధాకరమని, స్థానిక యంత్రాంగం, ప్రజల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించామని, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని హిమాచల్ సీఎం సుఖు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో మృతదేహాల కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.