Bihar : బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక బ్రిడ్జి నిర్మిస్తుండగా బీమ్ లాంచర్, కాంక్రీట్ స్లాబ్ కూలడంతో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బిహార్లోని వైశాలి జిల్లాలోని లాల్గంజ్ ఏరియాలో గురువారం జరిగింది. ఇక్కడ భారత్మాలా స్కీం కింద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఎన్హెచ్-139 డబ్ల్యూ పరిధిలో నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తున్నారు.
దీనిలో భాగంగా ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. దీనిలో భాగంగా నిర్మించిన ఒక బీమ్ లాంచర్, కాంక్రీట్ స్లాబ్ ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. దీంతో ఈ సమయంలో అక్కడ పని చేస్తున్న ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే తోటి కార్మికులు.. క్షతగాత్రులను లాల్గంజ్ రిఫరల్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. ఇక్కడ ఆరుగురికి చికిత్స అందుతోంది. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. విషమంగా ఉన్న ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ప్రధాన ఆస్పత్రులకు తరలించారు. ఘటనలో ఒక వ్యక్తి బ్రిడ్జికి చెందిన ఇనుప రాడ్లలో చిక్కుకుపోయాడు.
అతడిని బయటకు తీసేందుకు ఆ ఇనుప రాడ్లను కట్ చేయాల్సి వచ్చింది. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్తలంలో పరిస్తితిని జిల్లా మెజిస్ట్రేట్ వర్షా సింగ్ పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఘటనా స్తలంలో భద్రతా ప్రమాణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో బ్రిడ్జికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.