న్యూఢిల్లీ : పత్రికా సమావేశాలు నిర్వహించని ప్రధాని నరేంద్ర మోదీ విధానాన్ని విదేశీ వ్యవహారాల శాఖ సమర్థించడం తీవ్ర లోపభూయిష్టం అంటూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తప్పుపట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు మీడియాను విస్మరించరని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా మీడియాతో క్రమం తప్పకుండా సంభాషించడం, వారి ప్రశ్నలకు సమాధానమివ్వడం జరుగుతుందని ఎడిటర్స్ గిల్డ్ వివరించింది. ప్రధాని మోదీ స్వదేశంలో గానీ, విదేశాల్లో గానీ ముందుగా సిద్ధం కాకుండా పత్రికా సమావేశాలు నిర్వహించడానికి అయిష్టత చూపడాన్ని సమర్థిస్తూ ఒక విజయవంతమైన రాజకీయవేత్తగా మోదీ దేశంలోని అధిక శాతం గ్రామీణ ఓటర్లతో నేరుగా మాట్లాడేందుకు ఇష్టపడతారని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు ఇటీవల ఇచ్చిన వివరణను ఎడిటర్స్ గిల్డ్ గురువారం విమర్శించింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ముఖ్యంగా ప్రపంచం తీవ్ర ఇంధన సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో అత్యవసర రాజకీయ, ఆర్థిక అంశాలపై పట్టణ, గ్రామీణ ప్రజలకు ప్రధాని క్రమం తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని గిల్డ్ పేర్కొంది.
ప్రధాని మోదీ మీడియా నుంచి ప్రశ్నలను ఎందుకు స్వీకరించరన్న ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ అధికారి చేసిన వాదనలో తీవ్రమైన లోపం ఉందని గిల్డ్ తెలిపింది. వాస్తవానికి ఈ భారీ సంక్షోభం(పశ్చిమాసియా యుద్ధం)పై తన అభిప్రాయాలను ఏ రకమైన మీడియాతోనైనా పంచుకోవడానికి ఆయన(మోదీ) విముఖత చూపుతున్నారని ఎడిటర్స్ గిల్డ్ ఒక ప్రకటనలో పేర్కొంది. సక్రమంగా పనిచేసే ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున గళమెత్తే మీడియా ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడానికి, ప్రజలు ఎదుర్కొంటున్న అత్యవసర, కీలక సమస్యలపై స్పందనలను రాబట్టడానికి కృషి చేస్తుందని గిల్డ్ తెలిపింది. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సాగే ముందే రాసి సిద్ధం చేసుకున్న ఏకపక్ష సమాచార ప్రసారం అనేది స్వతంత్ర మీడియాతో జరిపే బహిరంగ సంభాషణకు ప్రత్యామ్నాయం కాదని ఎడిటర్స్ గిల్డ్ స్పష్టం చేసింది. సమర్థించుకోవడానికి చేసే అటువంటి వాదనలు భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు అటువంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని గిల్డ్ హితవు చెప్పింది.