చెన్నై: ఏడాది ముందే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్నది. పార్టీలు ఎన్నికల బరిలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార డీఎంకేను ఎలాగైన గద్దెదించి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవడానికి పొత్తుల ఎత్తులతో కూటములు కడుతున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే (AIADMK), బీజేపీ మళ్లీ ఒక్కటయ్యాయి. గత నెల 11న వచ్చే ఎన్నికల్లో తాము కలిసి పనిచేయనున్నట్లు రెండు పార్టీల నేతలు ప్రకటించారు. ఇందులో భాగంగా బీజేపీతో పొత్తును ఆమోదిస్తూ అన్నాడీఎంకే కార్యవర్గం తీర్మానం చేసింది. అదేవిధంగా ఎడప్పాడి పలనిస్వామి నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తీర్మానించింది. దీంతోపాటు డీఎంకేను వ్యతిరేకించే పార్టీలు తమ కూటమిలోకి ఆహ్వానించింది.
గత ఎన్నికల సమయంలో 525 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన డీఎంకే.. ఇప్పటికీ వాటిని నెరవేర్చలేదని విమర్శించింది. మూడు భాషల వివాదాన్ని ముందుకేసుకుని ప్రజలను మోసం చేస్తున్నదని దుయ్యబట్టింది. కాగా, 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరుగనున్నాయి. డీఎంకే, అన్నాడీఎం కూటములతోపాటు ప్రముఖ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఈసారి ఎన్నికల బరిలో నిలువనుంది. అదేవిధంగా నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పార్టీ ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ నెలకొన్నది.
తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తులకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1998 సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే పార్టీ బీజేపీతో జతకట్టి రాష్ట్రంలోని 39 సీట్లలో 30 సీట్లను గెలుచుకుంది. అయితే, తర్వాతి సంవత్సరమే ఏఐఏడీఎంకే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. 2004 లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. అన్నాడీఎంకే కేవలం ఒక సీటును గెలుచుకోగా, బీజేపీకి ఒక్క సీటూ దక్కలేదు. కేంద్రంలో ఎన్డీయే పాలన ముగియడంతో యూపీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. జయలలిత శకం తర్వాత, ఏఐఏడీఎంకే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ కూటమి కేవలం 75 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. 2023లో ఈ కూటమి ముక్కలైంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన ఇరు పార్టీలు ఒక్కటీ గెలువలేకపోయాయి. డీఎంకే 39 సీట్లను కైవసం చేసుకుంది.