తిరువనంతపురం : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెను ప్రశ్నించేందుకు ఈ నెల 12న కొచ్చిలోని తమ జోనల్ కార్యాలయానికి హాజరు కావాలని కోరింది. పీఎంఎల్ఏ చట్టం కింద ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
వీణాతో పాటు మరికొందరికి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. కేరళకు చెందిన ఇసుక వెలికితీత సంస్థ కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్), వీణాకు చెందిన మూతపడిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ ఆరోపణలు నమోదు చేసింది.