National Herald case | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. వీరు రూ. 142 కోట్ల మేర అనుచిత లబ్ధి పొందారని ఈడీ ఆరోపించింది. 2023 నవంబర్‌లో రూ. 751.9 కోట్ల మేర ఆస్తులను తాము జప్తు చేసేంతవరకూ సోనియా, రాహుల్ ఈ నేరపూరిత చర్యలను కొనసాగించినట్టు ఈడీ ఆరోపించింది. ఇది ఆర్థిక నేరం కిందికే వస్తుందని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ తన వాదనను వినిపించింది.
కాంగ్రెస్ పార్టీకి విరాళాల పేరిట ప్రజల నుంచి సేకరించిన సొమ్మును వాణిజ్య అవసరాలకు ఉద్దేశించిన కంపెనీలో పెట్టినట్టు విచారణ సందర్భంగా ఈడీ ఆరోపించింది. ఇక్కడ ప్రజలే బాధితులుగా మారినట్టు వెల్లడించింది. ప్రజల సొత్తును వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోవడానికి ‘యంగ్ ఇండియా’ అనే కంపెనీని ఏర్పాటు చేశారని ఈడీ గుర్తు చేసింది. అలా ఈ కంపెనీ ద్వారా రూ. 2000 కోట్ల విలువైన ఏజేఎల్ సంస్థ ఆస్తులపై హక్కులు సాధించినట్టు ఆరోపించింది. ఈ క్రమంలో అద్దె, ఇతరత్రాల రూపంలో రూ. 142 కోట్లను సోనియా, రాహుల్ అయాచితంగా పొందారని తెలిపింది. ఇది ముమ్మాటికీ మనీలాండరింగ్ కిందకే వస్తుందని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో రాహుల్, సోనియాతో పాటు శామ్‌పిట్రోడా, సుమన్ దూబే తదితరులు కూడా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు పేర్కొంది. ఈడీ దాఖలు చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం జూలై 2 నుంచి జూలై 8 వరకూ ప్రతీరోజూ ఈ కేసును విచారిస్తామని వెల్లడించింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో నెహ్రూ, పలువురు స్వాతంత్య్ర సమరయోధులు కలిసి ప్రారంభించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ప్రచురణ సంస్థ నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించేది. నేషనల్ హెరాల్డ్ సంస్థ బకాయిలు పేరుకుపోవడంతో 2008లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. కాగా, 2010లో కాంగ్రెస్ ఏజేఎల్ సంస్థకు రూ.90 కోట్ల మేర రుణాలు ఇచ్చింది. 2010 నవంబర్‌లో ఆ రుణాలను వసూలు చేసుకొనే హక్కును రూ. 50 లక్షలకే యంగ్ ఇండియా అనే కంపెనీకి కట్టబెట్టింది. అలా ఏజేఎల్‌కు చెందిన 99% షేర్లు యంగ్ ఇండియాకు బదిలీ అయ్యాయి. యంగ్ ఇండియాలో సోనియా, రాహుల్‌కు 76% షేర్లు ఉన్నాయి. యంగ్ ఇండియా కంపెనీ కేవలం రూ. 50 లక్షలు చెల్లించి, రూ. 90.25 కోట్ల విలువైన ఏజేఎల్ సంస్థ ఆస్తులపై హక్కు సాధించిందని, ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 2వేల కోట్ల వరకు ఉంటుందని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2012లో కోర్టును ఆశ్రయించారు.