న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: అసెంబ్లీ ఎన్నికలవేళ పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఏకకాలంలో పెద్ద ఎత్తున సోదాలను చేపట్టారు. ప్రజా పంపిణీ కోసం కేటాయించిన గోధుమల అక్రమ రవాణా, అమ్మకాలకు సంబంధించి కేసులో దర్యాప్తు నిమిత్తం కోల్కతాలో శనివారం ఈడీ అధికారులు పలు చోట్ల ఆకస్మిక దాడులను చేపట్టారు. ఒక్క కోల్కతా నగరంలోనే 9 ప్రాంతాల్లో దాడులకు దిగింది.
ప్రముఖ వ్యాపారవేత్త పార్థసారథి ఇల్లు, ఇతర కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రభుత్వానికి చెందిన గోధుమలు పెద్ద ఎత్తున దారి మళ్లించి, అక్రమంగా అమ్మివేశారన్న ఆరోపణలపై 2020లో పోలీస్ కేసు నమోదైంది. దీని ప్రకారం ఈడీ మనీలాండరింగ్ చట్టాల కింద కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టింది. రాష్ట్రంలోని గోధుమ సరఫరాదారులు, పంపిణీదారులు కుమ్మక్కయ్యారని, బస్తాలపైన ఉండే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేబుళ్లను దాచి పెట్టారని, వాటిని రహస్యంగా అమ్మేసి..ఎగుమతి చేశారని ఈడీ ఆరోపణలు నమోదు చేసింది. రాష్ట్ర మాజీ మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్ సహా పలువురు ఈ కేసులో ఇప్పటికే అరెస్టయ్యారు.