ED Questions | రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ప్రశ్నించింది. మనీలాండరింగ్ నివారణ చట్టం (PMLA) కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గతంలోనూ యెస్ బ్యాంక్ ద్వారా జరిగిన చట్టవిరుద్ధ రుణాల పంపిణీకి సంబంధించిన వేర్వేరు మనీలాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది. ఈ కేసులో కపూర్, అంబానీ మధ్య సంబంధం ఉందని తాము అనుమానిస్తున్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. మార్చి 31, 2017 నాటికి రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ (ADAG గ్రూప్)లో యెస్ బ్యాంక్ సుమారు రూ.6వేల కోట్ల పెట్టుబడి పెట్టింది.
ఈ మొత్తం ఒక సంవత్సరంలోపే (మార్చి 31, 2018 నాటికి) రెట్టింపై రూ.13వేలకోట్లకు చేరింది. దర్యాప్తులో ఉన్న కంపెనీలు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL)లో పెట్టుబడులన్నీ.. నిరర్ధక పెట్టుబడులుగా (NPIs) మారాయని, ఫలితంగా ఈ లావాదేవీల వల్ల బ్యాంకుకు రూ.3,300 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు ఆరోపించారు. ఏడీఏజీ కంపెనీలు కపూర్ కుటుంబం నియంత్రణలో ఉన్న సంస్థలకు రుణాలు అందించినట్లుగా ఆరోపించారు. ఈ ఒప్పందాలకు సంబంధించి ఇద్దరు వ్యాపారవేత్తలు ‘రహస్య’ సమావేశాలు నిర్వహించారని ఈడీ అనుమానిస్తున్నది. ఇదిలా ఉండగా.. 66 ఏళ్ల అంబానీని గతంలో తన గ్రూప్ కంపెనీల బ్యాంకు రుణాల అక్రమాలకు సంబంధించి ఈడీ ప్రశ్నించింది. ఇటీవల అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన కొన్ని కంపెనీలకు చెందిన రూ.1,120 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.