బెంగళూరు, అక్టోబర్ 18: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కార్యాలయంతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతికి ముడా కేటాయించిన స్థలాల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. తక్కువ విలువ కలిగిన భూమిని ముడాకు అప్పగించి, ప్రతిగా 14 విలువైన స్థలాలను పొందారని బీఎం పార్వతిపై ఆరోపణలు వచ్చాయి. ముడాకు అప్పగించిన 3.16 ఎకరాల స్థలంపైనా ఆమెకు న్యాయమైన హక్కు లేదనే వాదనలూ ఉన్నాయి. ఈ వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై ఇప్పటికే లోకాయుక్త పోలీసులతో పాటు ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తున్నాయి. విచారణలో భాగంగా శుక్రవారం సీఆర్పీఎఫ్ పహారాతో మైసూరులో ముడా కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, ముడా కుంభకోణానికి సంబంధించిన పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈడీ సోదాలను బీజేపీ, జేడీఎస్ స్వాగతించాయి.