హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవిత విషయంలో చట్ట ప్రకారం ఈడీ విచారణ చేయడంలేదని ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్‌కుమార్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, ఆ తీర్పుకు అనుగుణంగా తాము నడుచుకుంటామని చెప్పారు. మహిళను ఇంటి వద్దే విచారించాలని సీఆర్పీసీ చట్టం స్పష్టం చేస్తున్నదని, అందుకు విరుద్ధంగా తమ వద్దకే రావాలని ఈడీ సమన్లు జారీ చేసిందని తెలిపారు. ఆ అధికారం ఈడీకి లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితను గురువారం విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సోమా భరత్ ఆమె ప్రతినిధిగా ఈడీ కార్యాలయానికి హాజరై అధికారులు అడిగిన పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ అడిగిన 12 రకాల పత్రాలు, వాటి సెట్లను ఈడీ ఉన్నతాధికారులకు అందజేసినట్టు వెల్లడించారు. తమ హకుల సాధనకే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశామని స్పష్టంచేశారు. తమ పిటిషన్‌ను ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారణ చేయనున్నదని, న్యాయస్థానం ఇచ్చే తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు.
తప్పుడు కేసులతో వేధింపులు
దర్యాప్తు సంస్థలు ఇంటికి వచ్చి విచారించాలన్నది మహిళలకు ఉన్న హకు అని, అయితే ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ ఆ నిబంధనను తుంగలో తొక్కిందని సోమా భరత్‌కుమార్ ఆరోపించారు. ఈడీ నిబంధనలను అతిక్రమించినా తాము అలా చేయలేదని, చట్టాలపై గౌరవం ఉన్న బాధ్యతాయుతమైన పౌరులుగానే వ్యవహరించామని, ఎమ్మెల్సీ కవిత ఈ నెల 11న విచారణకు హాజరయ్యారని గుర్తుచేశారు. సాయంత్రం 6 గంటల వరకే విచారించాలనే నిబంధనను ఈడీ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితను రాత్రి ఎనిమిదిన్నర వరకు ఈడీ విచారించిన విషయాన్ని గుర్తుచేశారు. తప్పుడు కేసులు పెట్టి మహిళా నేతను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈడీ విచారణకు హాజరుకాబోమని తామెప్పుడూ చెప్పలేదని స్పష్టంచేశారు. చట్ట ప్రకారం మహిళలను ఇంటి వద్దే విచారించాలని పునరుద్ఘాటించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన అక్రమ కేసులను తాము ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు.